చంద్రబాబు: 'అధికారంలోకి రాగానే కమిషన్ వేసి కథ తేలుస్తాం..' - ప్రెస్‌ రివ్యూ

చంద్రబాబు

ఫొటో సోర్స్, fb/Telugu Desam Party

"ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్యాయం చేసిన వాళ్లు ఎక్కడున్నా పట్టుకొస్తాం, చట్టప్రకారం శిక్షిస్తాం. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కమిషన్ వేస్తాం. పోలీసులు, అధికారులకు చెబుతున్నా.. తప్పుడు కేసులు పెడితే రేపు అనేది ఉందని మర్చిపోవద్దు" అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించినట్లు ఈనాడు కథనం రాసింది.

ఆ కథనం ప్రకారం.. 36 గంటల నిరాహార దీక్ష చేపట్టిన చంద్రబాబు శుక్రవారం రాత్రి 8.30కు ఆ దీక్ష విరమించారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

డీజీపీ కార్యాలయం, బెటాలియన్‌కు సమీపంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. డీజీపీ అనుకుని ఉంటే ఇది జరిగేదా? పట్టాభిపై గతంలో దాడి చేశారు. అయినా దాడి చేసిన వారిపై కేసు లేదు. టీడీపీ కార్యాలయాలపై దాడుల విషయంలో సీబీఐతో విచారణ చేయించాలి. దోషుల్ని శిక్షించాలి. రాష్ట్రం నాశనమైపోతోందనే రాష్ట్రపతి పాలన అడుగుతున్నామని చంద్రబాబు అన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి

ఫొటో సోర్స్, SAJJALAOFFICIAL

చంద్రబాబుది దీక్షే కాదు-వైసీపీ

చంద్రబాబు చేసింది దీక్షే కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు సాక్షి తెలిపింది.

'36 గంటలపాటు నిరాహార దీక్ష చేసిన చంద్రబాబు.. అదీ 74 ఏళ్ల వయస్సులో.. తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధపడుతూ.. అన్ని గంటలపాటు దీక్ష చేసిన తర్వాత.. గంటన్నరపాటు ఆవేశంతో ఊగిపోతూ సుదీర్ఘ ప్రసంగం చేయగలరా' అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రకాశ్ రాజ్

ఫొటో సోర్స్, fb

మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. ఇదిగో ఆధారాలు: ప్రకాశ్‌రాజ్

''మా' ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రౌడీషీటర్లు 'మా' ఎన్నికలను ప్రభావితం చేశారని ప్రకాశ్‌రాజ్ ఆరోపించినట్లు ఆంధ్రజ్యోతి కథనం రాసింది.

దాని ప్రకారం.. మా ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నాయకుడు నూకల సాంబశివరావు పోలింగ్‌ బూత్‌లో విష్ణు మంచు వెంట ఉన్నారని, అతనిపై రౌడీ షీట్‌ ఉందని ప్రకాశ్‌రాజ్‌ ఆరోపణలు చేశారు. ఆధారాలతో మా ఎన్నికల అధికారికి ప్రకాష్‌రాజ్‌ లేఖ రాశారు.

'మా' ఎన్నికల్లో అధ్యక్షపదవికి మంచు విష్ణుతో పోటీపడిన ప్రకాష్‌రాజ్‌ తన ఓటమి తర్వాత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు పోలింగ్‌ బూత్‌లో అలాగే మోహన్‌బాబు ఫ్యామిలీతో నూకల సాంబశివరావు ఉన్న ఫొటోలను ఆయన శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.

'ఇది ఆరంభం మాత్రమే. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ సీసీటీవీ ఫుటేజీ ఇస్తే, 'మా' ఎన్నికల్లో అక్రమాలు బయటపెడతాను. ఈ నెల 14న ఎన్నికల అధికారిని సీసీ ఫుటేజి అడిగినా ఇప్పటిదాకా స్పందన లేకపోవడం విచార కరం' అన్నారు.

దీనిపై స్పందించిన కృష్ణమోహన్‌ ''సీసీటీవీ ఫుటేజి ఇప్పుడు నా పరిధిలో లేదు. ఫుటేజి ఇవ్వాలా వద్దా అనేది 'మా' అధ్యక్షుడు నిర్ణయించుకోవాలి' అని స్పష్టం చేశారు.

హరీశ్ రావు

ఫొటో సోర్స్, KCR/FACEBOOK

'పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందెవరు'?

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారంతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, అబద్ధాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నట్లు నమస్తే తెలంగాణ రాసింది.

ఆ కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలంలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పిన విషయాలపై మంత్రి హరీశ్‌ అగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పటంలో బీజేపీని మించినోళ్లు లేరని.. ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రాష్ర్టానికో ప్రాజెక్టు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడానికి క్రూడాయిల్‌ ధరలు పెరగటమే కారణమని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీతో పాటు రోడ్‌ సెన్స్‌, సర్‌చార్జ్‌ అని మూడు రకాల పన్నులు వేస్తున్నదని అన్నారు.

బీజేపీ అధికారంలోకి రాకముందు 2014లో లీటర్‌ పెట్రోల్‌ మీద పన్ను రూ.10.43 ఉండేదని, ఈ రోజు రూ.32.90కు పెంచిందని చెప్పారు. డీజిల్‌పై 2014లో ఒక లీటర్‌కు పన్ను రూ.4.52గా ఉండగా, ఇప్పుడది రూ.31.80 పెరిగిందని లెక్కలు తీశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తన బడ్జెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై ధరలు పెంచింది వాస్తవమని చెప్పారని, దీనిపై మాట్లాడేందుకు తాను సిద్ధమని, కేంద్రమంత్రిగా మీరు సిద్ధమా? అని కిషన్‌రెడ్డికి ఆయన సవాల్‌ విసిరినట్లు నమస్తే తెలంగాణ రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)