బొగ్గు సంక్షోభం: విద్యుత్ 'బ్లాక్ మార్కెటింగ్'పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు హెచ్చరించాల్సి వచ్చింది

భారత్ బొగ్గు దిగుమతి మొదలు పెడితే ప్రపంచ మార్కెట్‌లో బొగ్గు ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, NTPC

ఫొటో క్యాప్షన్, భారత్ బొగ్గు దిగుమతి మొదలు పెడితే ప్రపంచ మార్కెట్‌లో బొగ్గు ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి.

బొగ్గు సంక్షోభంపై వస్తున్న నివేదికల నేపథ్యంలో బహిరంగ మార్కెట్లలో విద్యుత్‌ను విక్రయించవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.

పెరుగుతున్న ధరలను అవకాశంగా తీసుకుని రాష్ట్రాలు కరెంటును అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తే, తమ నుంచి వచ్చే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

భారత్‌లో బొగ్గు నిల్వలు అడుగంటి పోతున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఈ ప్రకటన వెలువడింది. బొగ్గు కొరతతో కోల్‌ ఆధారిత విద్యుత్ ప్లాంట్లపై ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. బొగ్గు కొరత కారణంగా వారు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ధర ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో భారతదేశంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి.

విద్యుత్ సంస్థలకు అవసరమైన దానికన్నా తక్కువ బొగ్గు సరఫరా అవుతోంది

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, విద్యుత్ సంస్థలకు అవసరమైన దానికన్నా తక్కువ బొగ్గు సరఫరా అవుతోంది

బొగ్గు దిగుమతికి అనుమతించిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం మంగళవారం విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలకు బయటి నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది.

పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి, 10 శాతం విదేశీ బొగ్గుతోపాటు దేశీయ బొగ్గును క‌లిపి విద్యుత్ ఉత్ప‌త్తిని పెంచ‌డానికి ప‌వ‌ర్ ప్లాంట్ల‌కు కేంద్రం అనుమ‌తినిచ్చింది.

ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే అధిక ధరలో ఉన్న బొగ్గు, భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత ఖరీదవుతుందని భావిస్తున్నారు.

భారతదేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను నడుపుతున్న కంపెనీలు ఇప్పటి వరకు ప్రధానంగా దేశీయ బొగ్గును ఉపయోగించేవి. దిగుమతులపై ఆధారపడటం చాలా అరుదు.

విద్యుత్ వినియోగం పెరిగిన స్థాయిలో ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్‌ నుంచి బొగ్గు ఉత్పత్తి కావడం లేదని ప్రభుత్వం పేర్కొంది. దీంతో బొగ్గు దిగుమతికి సంబంధించి ప్రభుత్వ విధానంలో మార్పు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

కరోనాకు సంబంధించిన ఆంక్షలను తొలగించిన తర్వాత భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఊపందుకున్న వెంటనే, విద్యుత్ డిమాండ్ కూడా అదే వేగంతో పెరగడం ప్రారంభమైంది.

ప్రధానమంత్రికి లేఖ రాసిన వారిలో ఏపీ సీఎం జగన్ కూడా ఉన్నారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధానమంత్రికి లేఖ రాసిన వారిలో ఏపీ సీఎం జగన్ కూడా ఉన్నారు

కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన ప్రకారం, కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయడానికి బదులుగా లోడ్ షెడింగ్ (విద్యుత్ సరఫరాను నిలిపివేయడం) చేస్తున్నాయి. తద్వారా ఆదా చేసిన విద్యుత్ శక్తిని అధిక ధరలకు విక్రయిస్తున్నాయని తెలిపింది.

అయితే, ఏ రాష్ట్రాలు ఇలా చేస్తున్నాయో కేంద్ర ప్రభుత్వం వివరంగా చెప్పలేదు.

"ఇలా చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తాం. రాష్ట్రాలు ఇలా చేస్తే, వారి వాటాను విద్యుత్ అవసరమైన ఇతర రాష్ట్రాలకు ఇస్తాం" అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఎన్‌టీపీసీ, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు విద్యుత్తును విక్రయించడానికి పంపిణీ సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. వాటి ఉత్పత్తిలో 15 శాతం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంది. ఇది రాష్ట్రాలకు కేటాయిస్తారు.

ఏదైనా రాష్ట్రానికి మిగులు విద్యుత్ ఉంటే, అది మరింత అవసరమైన రాష్ట్రాలకు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎన్టీపీసీ రామగుండం

ఫొటో సోర్స్, NTPC ramagundam

రాష్ట్ర ప్రభుత్వాల ఫిర్యాదు

రాష్ట్రాల ఫిర్యాదు తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి ఈ హెచ్చరిక వచ్చింది. ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్‌లో విద్యుత్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదు చేశాయి.

న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ నివేదిక ప్రకారం, గతంలో ఇండియన్ ఎక్స్‌ఛేంజ్‌ లిమిటెడ్ షేర్లలో రికార్డు ర్యాలీకి ఇదే కారణం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి పెరుగుతున్న విద్యుత్ ధరలపై ఫిర్యాదు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 8 వరకు, ఆంధ్రప్రదేశ్ మూడు రెట్లు ఎక్కువ చెల్లించి యూనిట్‌కు రూ.15 చొప్పున విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

బొగ్గు సరఫరాను పెంచాలని వై.ఎస్. జగన్‌, ప్రధానిని కోరారు. మంగళవారం, ఇండియన్ ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్‌లో ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.20 గా ఉంది.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇంధన సంక్షోభంపై శనివారం హెచ్చరించారు. కొన్ని ఉత్తర, తూర్పు రాష్ట్రాలలో ప్రజలు ఇప్పటికే విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు.

బొగ్గు కొరతపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బొగ్గు కొరతపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు.

ప్రధానికి కేజ్రీవాల్ లేఖ

వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి కంటే ముందే, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్టోబర్ 9న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

దిల్లీకి విద్యుత్ అందించే థర్మల్ పవర్ ప్లాంట్లకు తగినంత బొగ్గు సరఫరా చేయాలని ఆయన అభ్యర్థించారు. బొగ్గు కొరత కారణంగా దిల్లీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని కేజ్రీవాల్ ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.

అదే సమయంలో దిల్లీ విద్యుత్ మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ, దిల్లీ విద్యుత్‌లో ఎక్కువ భాగం ఎన్‌టీపీసీ నుంచి వస్తుందని, ఒకవేళ సరఫరా నిలిపివేస్తే, దిల్లీ కూడా 'బ్లాక్‌అవుట్' పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సమస్యను ఒప్పుకోదని, ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజారుస్తుందని అక్టోబర్ 10న దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విమర్శించారు.

దేశంలో బొగ్గు సంక్షోభం ఉందని కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేకపోతోందని, వీరి విధానాలతో ఏ సమస్య అయినా దేశాన్ని భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తోందని సిసోడియా అన్నారు.

దిల్లీ పంపిణీ సంస్థలకు విద్యుత్ సరఫరాపై భరోసా ఇవ్వాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎన్‌టీపీసీ, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌ను కోరినట్టు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

రాత్రి వేళల్లో కరెంటు కోతలుండవు : యూపీ సీఎం

ఉత్తర్‌ప్రదేశ్‌లో రాత్రి వేళల్లో కరెంటు కోతలు విధించమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. న్యూస్ ఏజెన్సీ పీటీఐ ప్రకారం, నగరాలు, గ్రామాల్లో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండవని యోగి ఆదిత్యనాథ్ సోమవారంనాడు ప్రజలకు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్‌లకు బొగ్గు సరఫరా చేయడంపై సమగ్రంగా సమీక్షించాలని, రాష్ట్ర విద్యుత్ ప్లాంట్‌లకు తగినంత బొగ్గు సరఫరా ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ ఎం.దేవరాజ్‌ని యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

దీంతోపాటూ, రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 6 నుండి ఉదయం 7గంటల వరకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

అధిక ధరతో విద్యుత్ కొనుగోలు చేస్తోన్న బిహార్

ఇదే సమయంలో, గత ఐదు రోజుల్లో ప్రైవేట్ సంస్థల నుండి విద్యుత్‌ కొనుగోలుకు రూ.90 కోట్లు అదనంగా చెల్లించామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా బిహార్ ప్రతిరోజూ 5,500 మెగావాట్ల గరిష్ట లోడ్ డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేస్తుందన్నారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు త్వరలో బిహార్‌కు క్రమం తప్పకుండా విద్యుత్ సరఫరా చేస్తామని తనకు హామీ ఇచ్చారని, నితీశ్ కుమార్ అన్నారు.

"నేనే పరిస్థితిని సమీక్షిస్తున్నాను. ఎలాంటి సంక్షోభాన్ని నివారించడానికైనా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. కానీ రాష్ట్రానికి సరిపడా విద్యుత్ సరఫరా అందడం లేదు" అని నితీశ్ తెలిపారు.

"ఈ కొరతను తీర్చడానికి, బిహార్ ప్రైవేట్ సంస్థల నుండి అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేయడానికి అదనపు డబ్బు ఖర్చు చేస్తోంది" అని ఆయన అన్నారు.

కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే కరెంటు కోతలు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే కరెంటు కోతలు మొదలయ్యాయి.

ఇంధన సంక్షోభంపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఏమన్నారు?

అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధర పెరగడంతో, సరఫరాపై ప్రభావం పడి, విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం అన్నారు. అయితే, రాబోయే మూడు, నాలుగు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.

భారీ వర్షాల కారణంగా ఈ సంవత్సరం బొగ్గు ఉత్పత్తి, సరఫరా తగ్గిందని ఆయన చెప్పారు.

అయితే "గత అనేక సంవత్సరాల గణాంకాలను పోల్చి చూస్తే, ఈ సంవత్సరం సెప్టెంబరులో ప్రత్యేకించి అక్టోబర్‌లో బొగ్గు ఉత్పత్తి, సరఫరా అత్యధికంగా ఉన్నట్లు మేము గుర్తించాము. రాబోయే మూడు నాలుగు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది" అని ప్రహ్లాద్ జోషి అన్నారు.

"అంతర్జాతీయ ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. అందువల్ల, దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారంగా పనిచేసే విద్యుత్ కేంద్రాలు వాటి ఉత్పత్తిని నిలిపేశాయి. దీంతో మొత్తం భారం దేశీయ బొగ్గుపై పడింది"

రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో బొగ్గు లభ్యతపై "పూర్తి వివరాలను" అందజేస్తామని మంత్రి చెప్పారు.

వచ్చే 28 రోజులకు దేశంలో తగినంత బొగ్గు ఉందని, ఇంధనం అయిపోతుందనే భయం నిరాధారమని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ ఆదివారం అన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్య ఉండదని ఆయన తెలిపారు.

అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. భారతదేశంలోని 135 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో సగానికి పైగా ప్రస్తుతం తీవ్రమైన బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని బొగ్గు ఆధారిత ప్లాంట్లు మూతపడగా, మరిన్ని మూసివేత అంచున ఉన్నాయి.

వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం, దేశ అవసరాలకు సరిపడా బొగ్గు ఉందని బొగ్గు మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. బొగ్గు విద్యుత్ ప్లాంట్లకు రోజువారీ 18.5 లక్షల టన్నుల బొగ్గు అవసరం కాగా, రోజుకు 17.5 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే సరఫరా అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)