కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు

  • జుగల్ పురోహిత్
  • బీబీసీ న్యూస్
కోవిడ్ వారియర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇరవై రెండేళ్ల మాలతి గాంగ్వార్ , 56 ఏళ్ల సుజాత భవే కోవిడ్ మహమ్మారి సమయంలో తమ ఆప్తులను కోల్పోయారు. వైద్యరంగంలో పని చేసే వీరిద్దరి కుటుంబ సభ్యులూ కోవిడ్‌తో మరణించారు.

అయితే, కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వైద్య రంగ సిబ్బంది కుటుంబాలకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వ ప్రస్తుత తీరు వారిని విస్మయపరుస్తోంది.

కోవిడ్ మహమ్మారి ప్రారంభ దశలో.. ప్రధాన మంత్రి మోదీ స్వయంగా వైద్య రంగ సిబ్బందికి, వారి కుటుంబాలకు జేజేలు పలికారు. ఆయనను అనుసరిస్తూ, సాధారణ పౌరులు కూడా వైద్య రంగ సిబ్బంది కోసం పళ్లాలపై చప్పుడు చేస్తూ, దీపాలు వెలిగిస్తూ.. మిలిటరీ సిబ్బంది హెలికాఫ్టర్ల నుంచి పూలవాన కురిపిస్తూ కనిపించారు.

ఆ కుటుంబాలన్నీ ఇప్పుడెలా ఉన్నాయో తెలుసుకునేందుకు, బీబీసీ కొన్ని నెలల పాటు డాక్టర్లు, వైద్య సంస్థలు, మాజీ ప్రభుత్వ అధికారులు, ఉద్యమకారులు, క్షేత్ర స్థాయిలో వైద్యరంగ సిబ్బంది కుటుంబాలను కలిసింది.

ఈ పరిశోధనలో భాగంగా వివరాలు సేకరించేందుకు సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తులు చేయడంతో పాటు ప్రభుత్వ పత్రాలనూ పరిశోధించింది.

కోవిడ్ వారియర్స్ కోసం పువ్వులు చల్లుతున్న హెలికాప్టర్

ఫొటో సోర్స్, Getty Images

మేం ముందుగా దిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలోనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీకి దగ్గర్లో ఉన్న ఒక గ్రామానికి వెళ్లాం. అక్కడే నేను మాలతిని కలిశాను.

ఆమె ఇంటి వరండాలో కూర్చుని, తన తల్లి మరణాన్ని గుర్తు చేసుకున్నారు.

‘‘మా అమ్మ చనిపోయినప్పుడు వైద్య శాఖ సిబ్బంది సహా చాలా మంది నాకు కాల్ చేశారు. మా అమ్మ ఉద్యోగాన్ని చేయమని వారు నన్ను కోరారు. అప్పుడు ఇన్సూరెన్సు డబ్బు గురించి ప్రస్తావన వచ్చింది. అందరూ మద్దతు అందిస్తున్నట్లే మాట్లాడారు.

అమ్మ చేసే ఉద్యోగంలో చేరేందుకు ఒక ఫార్మ్ నింపమంటే, అది కూడా నింపాను. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు" అని మాలతి చెప్పారు.

మాలతి తల్లి శాంతి దేవి ఆశా హెల్త్ వర్కర్. ఆమె కోవిడ్ సోకి మరణించి నాలుగు నెలలు కావస్తోంది.

సహాయం చేయాలంటూ ఆ కుటుంబం చాలాసార్లు అధికారులను సంప్రదించింది.

కానీ, ఇప్పటి వరకు ఆమెకు రావాల్సిన పరిహారం కానీ, ఆమె కూతురికి ఉద్యోగం కానీ రాలేదు.

శాంతి 25 ఏళ్లు ఆ ఉద్యోగం చేశారని, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.

"మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. సహాయం కోసం చూస్తున్నాం" అని శాంతి సోదరుడు చెప్పారు.

వైద్యులు

ఫొటో సోర్స్, Getty Images

ముంబయిలో సుజాత భవే పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.

ఆమె భర్త డాక్టర్ చిత్తరంజన్ భవే ఈఎన్‌టీ వైద్యులు. ఆయన 2020 జూన్ 1న కోవిడ్ సోకి మరణించారు.

ఆయన రోగులకు వైద్యం అందిస్తున్న సమయానికి పీపీఈ కిట్‌లు లేకపోవడంతో పాటూ, కోవిడ్ నుంచి కాపాడుకునేందుకు తగిన శిక్షణ ఇవ్వలేదని ఆయన కుటుంబం చెబుతోంది.

"ఆయన మొదట్లో తన రోగులను ఆన్‌లైన్‌లో చూసేవారు. కానీ, చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలకు స్వయంగా చూడకుండా వైద్యం అందించడం కష్టం కావడంతో ఆయన ఆసుపత్రికి వెళ్లడం మొదలుపెట్టారు" అని సుజాత చెప్పారు.

ఆయన రోగులను నేరుగా పరిశీలించడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే, కోవిడ్ లక్షణాలు కనిపించాయి.

దాంతో, ఆయనను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన మరణించారు. చిత్తరంజన్ కుటుంబం పరిహారం కోసం దరఖాస్తు చేసినా అధికారులు దాన్ని తిరస్కించారు.

"నా భర్త ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ వార్డులో పని చేయకపోవడం వల్ల మా అభ్యర్థనను తిరస్కరించారు.

చికిత్స తీసుకోవడానికి ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించుకునే హక్కు రోగికి ఉంటుంది. చాలా సార్లు కోవిడ్ వచ్చిందని తెలిశాక కూడా కొంత మంది డాక్టర్లను కలవడానికి వెళుతున్నారు. కేవలం ప్రభుత్వ వైద్యులకే వైరస్ సోకిందనడానికి లేదు, ప్రైవేటు వైద్యులూ వైరస్ బారిన పడ్డారు. ఇది పూర్తిగా అన్యాయం. ఇది వివక్ష. మమ్మల్ని అవమానపరిచినట్లుగా అనిపించింది" అని ఆమె ఫోన్ కాల్ లో నాతో చెప్పారు.

మాలతి, సుజాత లాంటి చాలా కుటుంబాలతో బీబీసీ మాట్లాడింది.

కొందరు తమకు రావాల్సిన పరిహారం అందదేమో అన్న భయంతో ‘బీబీసీ’తో మాట్లాడటానికి నిరాకరించారు.

వైద్యుడు

ఫొటో సోర్స్, Getty Images

ఈ కుటుంబాలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి?

కేంద్రం 2020 మార్చి 26న ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించింది.

వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వైద్య రంగ సిబ్బంది కుటుంబాలకు రూ. 50 లక్షల నష్ట పరిహారాన్ని బీమా సంస్థ ఇస్తుందని మోదీ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పథకాన్ని ప్రకటిస్తూ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా వైద్యులను "తెల్లని యూనిఫామ్ ధరించిన దేవుళ్లు"గా అభివర్ణించారు.

కోవిడ్‌తో వైద్య రంగ సిబ్బంది ఎంతమంది మరణించారో చెప్పాలని ఈ ఏడాది జులైలో కొంత మంది ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.

కానీ, ప్రభుత్వం ప్రకటించిన బీమా పథకానికి అనుగుణంగా ఇన్స్యూరెన్సు అందచేస్తామని చెప్పింది.

ప్రభుత్వానికి మొత్తం 1342 బీమా క్లెయిమ్‌లు అందగా.. 2020 మార్చి 30 నుంచి 2021 జులై 16 మధ్య 921మంది క్లెయిమ్‌లను సెటిల్ చేసినట్లు ప్రభుత్వ డేటా చెబుతోంది. మిగిలిన 421 క్లెయిమ్‌లు పరిశీలన, తిరస్కరణ దశలో ఉన్నట్లు చెప్పింది.

బీమా సొమ్మును చెల్లించే విషయంలో జాప్యం జరుగుతున్నట్లు ప్రభుత్వం కూడా అంగీకరించింది. పరిహారం అందించే ప్రక్రియను 2021 మేలో క్రమబద్ధీకరించింది.

ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా బీబీసీ పొందిన డేటా ప్రకారం.. ప్రభుత్వం 2020 మార్చి 29 నుంచి 2021 జులై 08 మధ్య ఈ బీమా పథకం కోసం రూ. 663 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినట్లు తెలుస్తోంది.

మే 2021 తర్వాత సుమారు 70 శాతం చెల్లింపులు చేసింది.

హెల్త్ వర్కర్స్‌కి మద్దతుగా పళ్లాలపై చప్పుడు చేస్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

అయితే, మొత్తం మరణాలకు సంబంధించిన లెక్కలు లేకపోవడంతో, అన్ని కుటుంబాలకు పరిహారం అందిందా లేదా అన్న విషయానికి మాత్రం సమాధానం ఇవ్వలేకపోయింది.

ఈ బీమా పథకాన్ని రూపొందించిన విధానం, దీనిని అందరికీ అందించేందుకు తీసుకున్న చర్యల గురించి మాత్రం సమాధానం లభించలేదు.

వైద్య రంగ సిబ్బంది మరణాలకు సంబంధించి ప్రభుత్వం వివరాలు ఇవ్వకపోవడంతో, ఈ వివరాల కోసం బీబీసీ వైద్య సంబంధిత సంస్థలను సంప్రదించింది.

వైద్య సేవలు అందిస్తూ, సుమారు 1600 మంది వైద్యులు కోవిడ్ సోకి మరణించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.

కోవిడ్ విధులు నిర్వహిస్తూ 100 మందికి పైగా ఆశా వర్కర్లు మరణించినట్లు 2020 జులైలో ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పింది. కానీ, అప్పటికి భారతదేశంలో రెండో వేవ్ రాలేదు.

బీబీసీ సేకరించిన వివరాల ప్రకారం 1800 మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగ సిబ్బంది కోవిడ్‌తో మరణించారు.

అయితే, ఈ గణాంకాలలో సామాజిక కార్యకర్తలు, వాలంటీర్లు, వార్డు బాయ్స్, రోజు కూలీలు, అవుట్ సోర్స్ సిబ్బందికి సంబంధించిన లెక్కలు లేవు.

వైద్యులు

ఫొటో సోర్స్, Getty Images

పబ్లిక్ vs ప్రైవేటు

1800మందికి పైగా వైద్య సిబ్బంది మరణించినట్లు అంచనాలు ఉండగా వారిలో ప్రభుత్వ పరిహారం సుమారు 900 మందికి మాత్రమే అందింది.

మరణించిన వైద్య సిబ్బంది సంఖ్యకు, పరిహారం అందుకున్న కుటుంబాల సంఖ్యకు మధ్య అంత వ్యత్యాసం ఎందుకు కనిపిస్తోంది?

ప్రభుత్వం ప్రకటించిన బీమా పథకం కేవలం ప్రభుత్వ వైద్యులకు, ప్రభుత్వానికి అభ్యర్ధనలు చేసుకున్న ప్రైవేటు రంగ సిబ్బందికి మాత్రమే అందడం ఈ వ్యత్యాసానికి కారణం అని చెప్పవచ్చు.

మరో మాటలో చెప్పాలంటే, కోవిడ్ సోకి మరణించిన ప్రైవేటు వైద్య రంగ సిబ్బందిని ప్రభుత్వం గుర్తించలేదని అర్థం.

ప్రభుత్వం వైద్యులను ఇలా వివక్షతో చూడరాదని ఆగ్రాకు చెందిన డాక్టర్ మధు రాజ్‌పాల్ అన్నారు.

ఆమె భర్త డాక్టర్ వీకే రాజ్‌పాల్ ఒక ప్రైవేటు వైద్యుడు. ఆయన కూడా భారతదేశంలో రెండవ వేవ్ ఉద్ధృతంగా ఉన్నప్పుడు కోవిడ్ సోకి మరణించారు.

"నా భర్తకు 67 ఏళ్లు. క్లినిక్‌లో ఆయన రోగులను చూసేవారు. ఆయన వైద్యం చేసిన రోగులు కొంత మంది కోవిడ్ ఆసుపత్రుల్లో కూడా చేరారు. మేం రోగులను నిర్లక్ష్యం చేయలేం. మాకు కూడా పరిహారం అందాలని నేననుకుంటున్నాను. మా కుటుంబానికి ప్రధాన ఆధారమైన వ్యక్తిని కోల్పోయాం. దీంతో, మాకు చాలా సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వ వైద్యునికే పరిహారం ఇస్తాం, ప్రైవేటు వైద్యులకు ఇవ్వం అనడం మాపై వివక్ష చూపుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇది సరైంది కాదు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి" అని ఆమె అన్నారు.

బీమా పొందేందుకు అవసరమైన పత్రాలన్నిటినీ అధికారులకు సమర్పించినట్లు ఆమె చెప్పారు. వారి నిర్ణయం వినేందుకు ఆమె ఎదురు చూస్తున్నారు.

ఒకవైపు, డాక్టర్ రాజ్‌పాల్, డాక్టర్ భవే లాంటి వారు రోగులకు వైద్యం అందించాలనే నిర్ణయాన్ని స్వయంగా తీసుకుంటే.. మరోవైపు తప్పనిసరై రోగులను చూడాల్సి వచ్చిన పరిస్థితులను ఎదుర్కొన్న వైద్యులు కూడా ఉన్నారు.

క్లినిక్ తెరవకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ సర్క్యులర్ జారీ చేసినట్లు అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్ అధ్యక్షురాలు డాక్టర్ నీలిమ వైద్య భమారే చెప్పారు.

"ఇది బెదిరింపు కాదా? మేం మా ఉద్యోగాలు కోల్పోతాం. ప్రభుత్వం దగ్గర తగిన మౌలిక సదుపాయాలు లేవని గ్రహించడంతో ప్రైవేటు సిబ్బంది రంగంలోకి రావల్సి వచ్చింది. దాంతో, ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల తలెత్తాయి. ఇంత జరిగినా కూడా, మా అభ్యర్థనలను గౌరవించడం కానీ, మాకు సౌకర్యాలు అందచేయడం కానీ జరగడం లేదు. ఇది అన్యాయం కాదా?

ప్రభుత్వం వినడానికి సిద్ధంగా లేకపోతే మేం కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది" అన్నారామె.

పార్లమెంటు

ఫొటో సోర్స్, Ani

పార్లమెంటులో హెచ్చరిక

కోవిడ్ -19 మహమ్మారి, దాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వ సాఫల్యవైఫల్యాలు 2020 నవంబరులో పార్లమెంటులో చర్చకు వచ్చింది.

"భారతదేశంలో ఉన్న చాలా పబ్లిక్ ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో వైద్య స్థానాలు ఖాళీగా ఉండటంతో, ప్రైవేటు రంగ సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది పై ఆధారపడవలసి వచ్చింది" అని, పార్లమెంటులో ప్రభుత్వ వైద్య రంగానికి సంబంధించి విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

వైద్య రంగ సిబ్బందికి తగిన జీతం, ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు బీమా సదుపాయాన్ని కూడా ఇవ్వాలని ఆ నివేదిక పేర్కొంది.

మహమ్మారిలో పోరాడుతూ ప్రాణాలను అర్పించిన డాక్టర్లను అమరులుగా గుర్తించాలని, వారి కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కూడా పేర్కొంది.

అయినప్పటికీ, ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు రాలేదు.

ఈ మొత్తం పరిస్థితిని, భారతీయ వైద్య రంగ సిబ్బంది ఎలా పరిగణిస్తుందో తెలుసుకునేందుకు నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ జయేష్ లీలేను సంప్రదించాను.

"ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు. వారు సేకరించిన డేటాలో లోపాలున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో సహా మాకున్న 1700 శాఖలకు వచ్చిన డేటాను పరిశీలించి, మేం పరిహారం కోసం ప్రభుత్వానికి పంపాం. కానీ, కోవిడ్ సోకి మరణించిన 1600 మంది వైద్యులకు గాను, కేవలం 200 మందికే పరిహారం లభించినట్లు తెలిసింది. మిగిలిన వారి దరఖాస్తులు తిరస్కారానికి గురవడం కానీ, క్లెయిముల పరిష్కరాం మందకొడిగా కానీ జరుగుతోంది. ప్రభుత్వం సర్వే చేసి అర్హులందరికీ బీమా లభించేటట్లు చూడాలి" అని అన్నారు.

"నాకు చాలా విచారంగా ఉంది. మనం వ్యాక్సిన్ల కోసం ఖర్చు పెడుతున్నాం. ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే, మన దేశంలో మరణాల రేటు తక్కువగా ఉంది. లక్షలాది మందికి వైద్యం అందిస్తున్న భారతీయ వైద్య వ్యవస్థ వల్లే మరణాల రేటు తక్కువ ఉంది. అలాంటి వైద్యరంగ సిబ్బందిని నిర్లక్ష్యం చేయడం విచారకరం. ప్రధానమంత్రి డాక్టర్లకు చాలా మర్యాదనిచ్చారు. కానీ, దాని ప్రభావమేంటి? నాకు ఆ ప్రభావం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది" అని అన్నారు.

Modi

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం ప్రభుత్వం ఏమి చేయగలదు?

"ఈ బీమా పథకం సరళంగా లేదు" అని మాజీ వైద్య కార్యదర్శి కె.సుజాతరావు అన్నారు.

"ఈ పథకాన్ని మరింత విస్తృతపరచాలి. ఇందులో కేవలం వైద్య రంగ సిబ్బంది మాత్రమే కాకుండా, అంబులెన్స్ , కాంట్రాక్టు సిబ్బందిని కూడా చేర్చాలి. స్మశాన వాటికల్లో పని చేసిన వారిని కూడా చేర్చాలి. ఈ పథకానికి అర్హులను చేర్చే విషయంలో ప్రభుత్వం మరింత విశాల దృక్పథంతో వ్యవహరించాలి. వైద్య రంగ సిబ్బందికి అందరికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ప్రైవేటు రంగ సిబ్బందికి మధ్య వ్యత్యాసాన్ని ప్రదర్శించకూడదు" అని అన్నారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో మరణించిన వైద్య రంగ సిబ్బందికి సంబంధించిన గణాంకాలు.. బీమా పథకం అమలు, మరింత విస్తృతపరిచేందుకు చేపడుతున్న చర్యలు గురించి తెలుసుకునేందుకు వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను ‘బీబీసీ’ సంప్రదించింది.

ఇప్పటి వరకు ఆ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)