‘పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసి, పారిపోయిందని చెప్పాడు’ – ప్రెస్ రివ్యూ

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ప్రేమ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే భార్యను అమ్మేశాడో భర్త. ఆర్థిక సమస్యలున్నాయని పని కోసం రాజస్థాన్‌కు తీసుకెళ్లి.. అక్కడే మరో వ్యక్తి ఇంట్లో వదిలేసి వచ్చాడంటూ ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని బెల్పాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి వారు పెళ్లి చేసుకున్నారు.

పెళ్లైన రెండు నెలల తర్వాత ఆర్థిక సమస్యలున్నాయని, ఇటుకల బట్టీలో పనిచేద్దామని చెప్పి భార్యను రాయ్‌పూర్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజస్థాన్‌లోని ఓ గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ 55 ఏళ్ల వ్యక్తి రూ. 1.8 లక్షలకు భార్యను అమ్మేసి అతడి ఇంట్లో వదిలేసి వచ్చాడు.

ఆ డబ్బుతో విలాసవంతమైన హోటల్లో భోజనం చేసి, ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. అనంతరం యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె వేరే వ్యక్తితో పారిపోయిందని నమ్మబలికాడు.

అయితే, అతడిపై అనుమానం వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యులు బెల్పాడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతి రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు అక్కడికి చేరుకోగా వారికి గ్రామస్థుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. రోడ్లను బ్లాక్ చేసి వారిని అడ్డుకున్నారు. అతికష్టమ్మీద రాజస్థాన్ పోలీసుల సాయంతో ఆ యువతిని కాపాడి ఒడిశా పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.

కేసీఆర్

అడవి హద్దు తేల్చాలి - కేసీఆర్

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షించి, వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించినట్టు 'ఆంధ్రజ్యోతి' కథనం పేర్కొంది.

ఈ కథనం ప్రకారం.. ''అడవి మీద ఆధారపడి జీవించే అమాయకులైన గిరిజనులకు మేలు చేయడంతో పాటు అడవులను నాశనం చేసే శక్తులను గుర్తించి, వాళ్ల మీద కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అటవీ, పోలీసు అధికారులకు కేసీఆర్ స్పష్టం చేశారు.

వచ్చే నెల 8 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ దాకా పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఇతరుల నుంచి సాగు హక్కుల దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు.

నవంబర్‌ 8లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి, అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. రెండు, మూడు గ్రామాలకో నోడల్‌ అధికారిని నియమించాలని, సబ్‌ డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.

87 శాతం పోడు భూముల ఆక్రమణ కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, ములుగు, ఆదిలాబాద్‌, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్‌, వరంగల్‌, నల్గొండ, నిజామాబాద్‌ వంటి జిల్లాల్లోనే ఉన్నాయని అన్నారు.

అమరావతి భవనాలు
ఫొటో క్యాప్షన్, ప్రతికాత్మక చిత్రం

'రియల్‌' రంగంలో నయా ట్రెండ్‌

ఏపీ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొత్త ట్రెండ్‌ మొదలయ్యింది. ఇప్పటి వరకు 2 బీహెచ్‌కే (రెండు బెడ్‌ రూములు, కిచెన్‌) 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల స్థానంలో కొత్తగా అరగది వచ్చి చేరింది. ఇప్పుడు కొత్తగా 2.5 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లు కావాలని కొనుగోలుదారులు కోరుతున్నారని 'సాక్షి' ఒక కథనం ప్రచురించింది.

కోవిడ్‌ తర్వాత కొనుగోలుదారులు పిల్లల ఆన్‌లైన్‌ క్లాసులు లేదా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం ప్రత్యేకంగా స్టడీ రూమ్‌ కావాలని అడుగుతుండటంతో దీనికి అనుగుణంగా బిల్డర్లు ప్రత్యేకంగా ఒక అర గదిని కూడా నిర్మిస్తున్నారు.

బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ స్టడీ రూమ్‌ కాన్సెస్ట్‌ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఏపీలో ఇప్పుడే ప్రవేశించిందని బిల్డర్లు చెబుతున్నారు.

స్టడీ రూమ్‌ కాన్సెప్ట్‌కు డిమాండ్‌ పెరగడంతో ఇప్పుడు విశాఖలో పలువురు బిల్డర్లు 2.5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ఏపీ క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ రాజా శ్రీనివాస్‌ చెప్పారు.

కోవిడ్‌ తర్వాత విశాఖ, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ వంటి పట్టణాల్లో మార్కెట్‌ ఇంకా పుంజుకోవాల్సి ఉందని తెలిపారు.

బతుకమ్మ

బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ

దుబాయిలోని బుర్జ్‌ ఖలీఫా భవనం తెలంగాణ పండుగ సంబురానికి వేదికైందంటూ 'నమస్తే తెలంగాణ' పేర్కొంది.

ఆ కథనం ప్రకారం శనివారం సాయంత్రం బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

బతుకమ్మ వీడియోను బుర్జ్‌ ఖలీఫా తెరపై రెండుసార్లు ప్రదర్శించారు. మూడేసి నిమిషాల నిడివి గల ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.

సీఎం కేసీఆర్‌ చిత్రపటాన్ని సైతం బుర్జ్‌ ఖలీఫా స్క్రీన్‌ పై ప్రదర్శించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్‌ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన ప్రవాస తెలంగాణ వాసులు పులకించిపోయారు.

యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన లక్షల మంది పర్యాటకులు మన బతుకమ్మను ఎంతో ఆసక్తిగా తిలకించారు'' అని నమస్తే తెలంగాణ కథనంలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)