వరకట్నంపై ప్రపంచ బ్యాంక్ చేసిన అధ్యయనంలో ఏం తేలిందంటే..

  • సౌతిక్ బిస్వాస్
  • బీబీసీ న్యూస్
వివాహం

ఫొటో సోర్స్, AFP

గ్రామీణ భారతదేశంలో వరకట్నం చెల్లింపులు గత కొన్ని దశాబ్దాలుగా స్థిరంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు అధ్యయనం పేర్కొంది.

1960 నుంచి 2008 వరకు జరిగిన వివాహాల్లో కట్నం చెల్లింపుల తీరును అధ్యయనం చేశారు.

భారత్‌లో వరకట్నం తీసుకోవడం నేరం. కానీ ఇప్పటికీ 95 శాతం వివాహాల్లో కట్నకానుకలు, చెల్లింపులు జరుగుతున్నట్లు అధ్యయనకారులు చెప్పారు.

వరకట్నం తీసుకోవడాన్ని సామాజిక రుగ్మతగా చెప్పినప్పటికీ ఈ ఆచారం చాలా ప్రాంతాల్లో కొనసాగుతోంది.

కొందరు మహిళలు గృహ హింస, వరకట్నం చావులకు కూడా గురవుతూ ఉంటారు.

దక్షిణాసియాలో కట్నం ఇవ్వడం, తీసుకునే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది.

వివాహం జరిగే సమయంలో వధువు తల్లిదండ్రులు, వరుడి కుటుంబానికి నగదు, ఆభరణాలు, ఇతర కానుకల రూపంలో కట్నం ఇస్తారు.

ఈ అధ్యయనంలో భాగంగా దేశంలోని 17 రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ఈ అధ్యయనం దృష్టి సారించింది.

పెళ్లి కూతురు

ఫొటో సోర్స్, SAM PANTHAKY

వివాహ సమయంలో కట్నంగా ఇచ్చి, పుచ్చుకున్న విలువైన బహుమతులు, నగదు గురించిన సమాచారాన్ని ఆర్థికవేత్తలు ఎస్ అనుకృతి, నిషిత్ ప్రకాష్, సుంగోహ్ క్వోన్ విశ్లేషించారు.

అమ్మాయి తరఫు వాళ్లు, అబ్బాయి కుటుంబానికి ఇచ్చిన కట్న కానుకలు, పెట్టుపోతల విలువ, అబ్బాయి కుటుంబం అమ్మాయి కుటుంబానికి ఇచ్చిన వాటికంటే ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు.

చాలా కొన్ని కుటుంబాల్లో మాత్రమే అమ్మాయి తరపు వారు ఇచ్చిన బహుమతుల విలువ కంటే కూడా అబ్బాయి కుటుంబం వారు అమ్మాయికి ఇచ్చిన బహుమతుల విలువ ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.

అయితే సగటున ఈ వరకట్న చెల్లింపులు కొంతకాలంగా స్థిరంగానే ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లో అబ్బాయి కుటుంబం, అమ్మాయి తరపు కుటుంబానికి బహుమతులు ఇచ్చేందుకు సగటున 5000 రూపాయిలు ఖర్చు పెడుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది.

కానీ, అదే అమ్మాయి విషయానికొచ్చేసరికి, ఈ బహుమతుల విలువ అబ్బాయి తరపు వారు ఇచ్చే దాని కంటే 7 రెట్లు ఎక్కువ అంటే, సుమారు 32,000 ఖర్చు పెడతారని అధ్యయనంలో తేల్చారు.

అయితే, ప్రస్తుత లెక్కల్లో చూస్తే ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది.

వీడియో క్యాప్షన్, చైనాలో పెళ్లిళ్ల సంత

చాలా కుటుంబాల్లో పొదుపు చేసిన సొమ్ము, ఆదాయాలలో అధిక భాగం ఈ కట్న కానుకలకే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

2007లో గ్రామీణ భారతదేశంలో సగటున నగదు రూపంలో ఇచ్చే కట్నం విలువ వార్షిక గృహ ఆదాయంలో 14శాతానికి సమానంగా ఉంది.

"గ్రామీణ భారతంలో ఆదాయాలు పెరగడంతో, వరకట్నానికి వెచ్చించే వాటా తగ్గింది" అని వరల్డ్ బ్యాంక్ రీసెర్చ్ గ్రూప్‌లో ఆర్థికవేత్త డాక్టర్ అనుకృతి చెప్పారు. కానీ ఇది కేవలం సగటు లెక్క.

ప్రతి ఇంటిలో సంపాదించే ఆదాయంలో వరకట్నానికి వెచ్చించే మొత్తాన్ని కచ్చితంగా లెక్కించాలంటే, మనకు వారి ఆదాయం, ఖర్చుకు సంబంధించిన సమాచారం కూడా అవసరం ఉంటుంది. కానీ మన దగ్గర ఆ సమాచారం అందుబాటులో లేదు" అని ఆమె అన్నారు.

Presentational grey line
పెళ్లికూతురు

ఫొటో సోర్స్, Hindustan Times

భారతదేశంలో వివాహాలు

  • భారతదేశంలో సాధారణంగా ఒకరు ఒక వ్యక్తినే పెళ్లి చేసుకుంటారు.
  • 1 శాతం కంటే తక్కువ మంది విడాకులు తీసుకుంటారు.
  • 1960-2005 వరకు జరిగిన 90 శాతం వివాహాల్లో భాగస్వామిని ఎంపిక చేయడంలో తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషిస్తారు.
  • వివాహం తర్వాత 90 శాతానికి పైగా మహిళలు భర్త తరపు కుటుంబంతో కలిసి నివసిస్తారు.
  • 85శాతానికి పైగా అమ్మాయిలు మరో ఊరి అబ్బాయిలను వివాహం చేసుకుంటారు.
  • 78.3 శాతం వివాహాలు, అంతర్ జిల్లాలోనే జరుగుతాయి.

ఆధారం: మ్యారేజ్ మర్కెట్స్ అండ్ ది రైజ్ ఆఫ్ డౌరీ ఇన్ ఇండియా - చిప్లున్కార్, జెఫ్రీ వీవర్

Presentational grey line
పెళ్లి కూతురు

ఫొటో సోర్స్, SAM PANTHAKY

భారతదేశంలో 2008తో పోలిస్తే అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి.

కానీ కట్నం విషయంలో పెద్దగా మార్పులు లేవని ఈ అధ్యయనకారులు అంటున్నారు.

వివాహ మార్కెట్, వ్యవస్థ, చట్టాలు వంటి విషయాల్లో పెద్దగా మార్పులేమీ రాకపోవడమే దానికి కారణమని చెబుతున్నారు.

భారతదేశంలోని అన్ని మతాల వారిలో వరకట్నం ఆచారం ఉందని ఈ అధ్యయనం తెలిపింది.

క్రైస్తవులు, సిక్కు మతస్థులలో కూడా వరకట్నం పట్ల ఆసక్తి పెరిగిందని పేర్కొంది.

హిందువులు, ముస్లింల కంటే కూడా ఈ మతాల వారిలో ఇచ్చే సగటు కట్నం ఎక్కువగానే ఉంది.

రాష్ట్రాల మధ్య ఈ వరకట్నం విషయంలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉండటం మరొక ఆసక్తికరమైన విషయం.

1970ల నుంచి కేరళలో వరకట్నం ఎక్కువగా ఇస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా సగటున ఇచ్చే వరకట్నం ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది.

హరియాణా, పంజాబ్, గుజరాత్‌లలో కూడా వరకట్నం ఇవ్వడం పెరుగుతోంది. ఒడిషా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రలో వరకట్నంలో తగ్గుదల కనిపించింది.

వరకట్నం

ఫొటో సోర్స్, Getty Images

"ఈ వ్యత్యాసాల గురించి మా దగ్గర కచ్చితమైన సమాధానాలు లేవు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తర్వాత చేసే పరిశోధనలో తెలుస్తాయని ఆశిస్తున్నాం" అని డాక్టర్ అనుకృతి అన్నారు.

గత శతాబ్ద కాలంలో భారతదేశంలో జరిగిన 74,000 వివాహాలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్థికవేత్తలు గౌరవ్ చిప్లున్కార్, జెఫ్రీ వీవర్‌లు సేకరించారు. ఆ డేటాతో భారతదేశంలో వరకట్నం వ్యవస్థ ఎలా పరిణామం చెందింది అనే విషయాన్ని వాళ్లు వివరించారు.

దేశంలో 1930-1975 మధ్య కాలంలో జరిగిన వివాహాల్లో వరకట్నం చెల్లింపులు రెట్టింపు అయ్యాయని ఈ పరిశోధన తెలిపింది.

సగటున చెల్లించే వరకట్నం మొత్తం కూడా మూడు రెట్లు పెరిగింది. కానీ 1975 తర్వాత సగటు వరకట్నం చెల్లింపుల్లో తగ్గుదల కనిపించిందని ఈ అధ్యయనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)